Hon’ble CM Sri Revanth Reddy Hosts Miss World 2025 Delegates at Historic Chowmahalla Palace

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) ప్రతినిధులు, కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఈ విందులో మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొన్నారు.

విందు ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ (Miss World) పోటీదారులకు ‘చౌమహల్లా ప్యాలెస్ – హైదరాబాద్ వారసత్వ సంపద’పై లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. ప్యాలెస్‌ను సందర్శించిన కంటెస్టెంట్లు అక్కడ హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

నిజాం కాలం నాటి వస్తువులు, సైనిక సామగ్రిని తిలకిస్తూ వాటి విశిష్టతలను తెలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు తమనెంతో ఆకర్షించాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ సీఈవో జూలియా మోర్లే గారితో పాటు పలువురు కంటెస్టెంట్లు విందు సందర్భంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

“చౌమహల్లా ప్యాలెస్ అత్యంత అద్భుతంగా ఉంది. హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోంది. ఇది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదం మా దేశాల్లో వినిపిస్తాం” అని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వ్యాఖ్యానించారు.