CM Sri Revanth Reddy Inaugurated Miss World 2025 in Hyderabad with a Spectacular Display of Culture.

హైదరాబాద్ మహానగరంలో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ 2025 ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైనట్టు ముఖ్యమంత్రి గారు, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ గారు కరతాల ధ్వనుల మధ్య ప్రకటించారు.
తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్ ప్రారంభం కాగా, 110 దేశాలకు చెందిన ప్రతినిధులు ర్యాంప్ పై ప్రదర్శనగా వచ్చారు. చివరలో మిస్ ఇండియా నందిని గుప్తా త్రివర్ణ పతాకంతో కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలిచారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అండగా, వారి ధైర్య సాహసాలకు నిర్వాహకులు సెల్యూట్ ప్రకటించారు.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా లంబాడా కళాకారులు డప్పు, నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రపంచంలోనే ఒకటైన పురాతన కళగా నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు ప్రజాప్రతిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.