విశ్వగురు శ్రీ బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ, బసవన్న గారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టామని అన్నారు. బసవేశ్వరుడు సామాజిక న్యాయం అందించేందుకు ఎంతో కృషి చేశారని విశ్వగురు విధానాలను ముఖ్యమంత్రి గారు స్మరించుకున్నారు.
బసవన్న గారి స్ఫూర్తి సందేశానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, వారి సందేశమే పరిపాలనకు సూచిక అని అన్నారు. పేదలకు న్యాయం జరగాలని ఆనాడు అనుభవ మంటపాల ద్వారా తెలుసుకున్న విశ్వగురు ఆదర్శంగానే ప్రస్తుతం పార్లమెంట్, శాసనసభలు నిర్వహించుకుంటున్నామని వివరించారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కొండా సురేఖ గారు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, ఎంపీ సురేష్ షెట్కర్ గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
