దేశంలో సమూలమైన మార్పు రావాలంటే ప్రతి వారికీ నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రైవేటు సంస్థలకన్నా మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల సిబ్బందిని, అధ్యాపకులను, విద్యార్థులను ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తిగా అభినందించారు.
ప్రైవేటుకన్నా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించడం ప్రజా ప్రభుత్వం పనితీరుకు గీటురాయి అని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని బలంగా విశ్వసిస్తున్నామని, బసవన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
2025 మార్చి 21 వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు జరిగిన ఈ SSC పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తంగా 5,07,107 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ గా 4,96,374 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ పరీక్షల్లో బాలరకంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. బాలికలు 94.26 శాతం, బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటుగా 10,733 మంది హాజరు కాగా, వారిలో 57.22 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, హర్కర వేణుగోపాల్ రావు గారితో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.