CM Sri Revanth Reddy Leads Strategic Collaboration Talks Between Telangana and Hiroshima Prefecture

జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) గారితో సమావేశమై పలు అంశాలను చర్చించింది.

పర్యావరణ సాంకేతికత, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించారు. అలాగే పట్టణాభివృద్ధిలో భాగంగా విపత్తు నిరోధక నిర్మాణాలు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ పరిష్కారాల్లో హిరోషిమా అనుసరిస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని హైదరాబాద్‌లో ఉపయోగించే అవకాశాలపై చర్చలు జరిగాయి.

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ కేంద్రాల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో “హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ & మొబిలిటీ కారిడార్” ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు మరియు హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మధ్య విద్య, విజ్ఞాన మార్పిడి, సంయుక్త పరిశోధనలకు సహకారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు.

శాంతి ఉద్యానవన అభివృద్ధి, బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలపై ఇరు రాష్ట్రాల మధ్య సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, హిరోషిమా ప్రభుత్వం అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి, స్థిరత్వం, సాంకేతిక పురోగతిలో హిరోషిమా సాధించిన విజయాలను ప్రశంసించారు. శాంతి, సుస్థిరత కోసం ప్రపంచంతో సహకారానికి తెలంగాణ కట్టుబడి ఉంటుందని ఉద్ఘాటించారు.

తెలంగాణ-హిరోషిమా మధ్య పలు రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు.