Hon’ble CM Sri A. Revanth Reddy Addresses the Media at Dr BR Ambedkar Telangana State Secretariat, Hyderabad on Delimitation of Lok Sabha Seats

దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌లో జరగాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. “చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడానికి సంపూర్ణ మద్దతునిస్తాం. కానీ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు కేంద్రం ప్రకటించిన ప్రాతిపదిక దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచడమే కాకుండా దేశానికి ప్రమాదకరంగా మారుతుంది..” అని హెచ్చరించారు.

అందుకు ప్రతిగా ముఖ్యమంత్రి గారు జీఎస్డీపీ (GSDP) ఆధారిత హైబ్రీడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లో పెంచాలనుకుంటున్న 50 శాతం అంటే 272 స్థానాల్లో 136 సీట్లను ప్రొరేటా ప్రకారం, మిగిలిన 136 సీట్లను జాతీయ స్థూల ఉత్పత్తి ప్రాతిపదికన విభజించి అత్యధిక శాతం అందిస్తున్న రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రతిపాదించారు.

“ఈ నెల 16 నుంచి నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పెంపు బిల్లును హడావిడిగా ఆమోదించాలని ప్రయత్నిస్తున్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు, నియోజకవర్గాల సంఖ్య పెంపు – పునర్విభజన రెండింటినీ ఒకటిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు

ఈ రెండు వేర్వేరు అంశాలు. ఒకదానికి ఇంకొకటి సంబంధం లేదు. రెండూ వేటికవే చాలా ప్రాధాన్యత కలిగిన అంశాలు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని స్పష్టం చేశారు.

“కానీ ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఏకపక్షంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు దామాషా ప్రకారం 50 శాతం లెక్కన నియోజకవర్గాల సంఖ్యను పెంచితే దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతాయి. ఈ ప్రక్రియ వల్ల దేశంలో అనవసరమైన గందరగోళం ఏర్పడుతుంది. కొన్ని చిన్న రాష్ట్రాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.

“ప్రస్తుతం తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి ప్రాతిపదిక తీసుకోలేదు. నియోజకవర్గాల పెంపుపై ముందుగా విధివిధానాలు ఖరారు చేయాలి. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఈ అంశంపై నిపుణుల కమిటీని నియమించాలి. నిపుణుల కమిటీ నివేదికపై పార్లమెంట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి” అని సూచించారు.

నియోజకవర్గాల పెంపు – పునర్విభజనకు సంబంధించి కేంద్రం తాజా నిర్ణయంపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

“నియోజకవర్గాల పెంపు (డీలిమిటేషన్) ప్రక్రియ దేశ ప్రజలకు సంబంధించిన అంశం. దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్న అంశం. ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వ హడావిడి నిర్ణయం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది.

మహిళలకు రిజర్వేషన్ల విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. నూటికి నూరు శాతం సంపూర్ణంగా మద్దతునిస్తున్నాం. 2023 లోనే ఈ బిల్లు ముందుకొచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతునిచ్చాం. 2026 లో చేపట్టే జనాభా లెక్కల తర్వాత అన్న చిన్న అడ్డంకిని అప్పుడే సవరించి, 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఆ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మహిళలకు అవకాశాలు దక్కి ఉండేవి.

2023 లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందినప్పుడు ఆ తర్వాత జరిగే జనాభా లెక్కల అనంతరం అమలులోకి వస్తుందని, ఇప్పుడు అలా కాకుండా ముందే చేయాలనుకుంటే అభ్యంతరం లేదు.

కానీ అదేదో 2024 ఎన్నికల్లోనే అమలు చేసి ఉంటే 543 లోక్‌సభ స్థానాల్లో 33 శాతం (181 మంది మహిళా ఎంపీలు) ఎంపిక కావడానికి అవకాశం ఉండె. ఆ తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. వాటిల్లోనూ మహిళా ప్రతినిధులు ఎంపికయ్యేవారు” అని ముఖ్యమంత్రి గారు విశ్లేషించారు.

“ఒకవైపు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2028 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కలు ప్రక్రియను పక్కన పెట్టి, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు రెండింటినీ కలిపి ఒక గాటన కట్టి తెరమీదకు తేవడం సరైంది కాదు.

మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పునర్విభజన కూడా కలిపారు. ఈ పరిణామాలు దేశంలో రాజకీయ అసమానతలు, వివక్ష పెంచుతుంది. దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. జరుగుతున్న పరిణామాలపై దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు లేఖలు రాస్తాం” అని చెప్పారు.

“జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య నిర్ణయం అంగీకరించబోమని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీర్మానించాం. దాంతో ఇంకో రూపంలో దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని ముందుకు తెచ్చారు.

తాజా ప్రతిపాదనల మేరకు 20 స్థానాలున్న కేరళంలో 50 శాతం పెంచితే ఆ రాష్ట్ర స్థానాలు 60 కి చేరుతాయి. అదే ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు 120 కి చేరుతాయి. రెండింటి మధ్య అంతరం 90 స్థానాలవుతాయి. 50 శాతం పెంచడం వల్ల తెలంగాణకు యూపీకి మధ్య ఇప్పుడున్న వ్యత్యాసంకన్నా ఎక్కువగా 94 సీట్ల అంతరం పెరుగుతుంది.

413 సీట్లున్న ఉత్తరాదిలో 50 శాతం సీట్లు పెంచడం వల్ల 621 కి పెరుగుతాయి. అంటే దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య సీట్ల అంతరం 412 నుంచి 620 కి పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు తీరని విఘాతం. చిన్న రాష్ట్రాలు రాజకీయంగా ద్వితీయశ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోతాయి.

ఈ పరిణామాలు దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు. దేశ ప్రజలకు సంబంధించిన అంశం. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులుగా, ఉత్తరాధి రాష్ట్రాలు రాజకీయ రాజధానులుగా మారకూడదు” అని అన్నారు.

“దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాంటప్పుడు మమ్మల్ని ఎలా శిక్షిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 50 శాతం రిజర్వేషన్లు మించకూడదు. 50 శాతం మెరిట్ ప్రాతిపదికన ఇస్తున్నాం. పన్నులు కట్టడం, సలామ్ చేయడమన్న విధానాలకు వ్యతిరేకం” అని స్పష్టం చేశారు.

“ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగలేదు. వంద శాతం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరగలేదు. ఆయా ప్రాంతాల ప్రాతినిధ్యం కోసమే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు ఇచ్చారు” అని గుర్తుచేశారు.

“రాజకీయంగా నంబర్ లేనప్పుడు చిన్న రాష్ట్రాలతో మాట్లాడే వారే ఉండరు. బలహీనుడికి, బలవంతుడికి మధ్య ఒప్పందాలు జరగవు. ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవలసి వస్తుంది.

సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన, ఎన్ని పెంచాలన్నది అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. గతంలో జనాబా లెక్కల ప్రకారం 543 స్థానాలు చేశారు. దానిపై బ్లాంకెట్ గా 50 శాతం పెంచుతామని చెప్పడం సరికాదు. దీర్ఘకాలంలో సమస్యగా విపత్తుగా మారుతుంది” అని హెచ్చరించారు.

“హైబ్రీడ్ మాడల్‌లో 136 సీట్లు ప్రొరేటా ప్రకారం ఇవ్వండి. ఇంకో 50 శాతం సీట్లు దేశం స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన ఇవ్వాలని ఒక ప్రతిపాదన చేస్తున్నాం. దానిపై చర్చించి నిర్ణయం తీసుకోండి. దేశ అభివృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చుతున్న అత్యధిక భాగస్వామ్యం కలిగిన రాష్ట్రాల ప్రాతిపదికన ఇవ్వాలని కోరుతున్నాం” అని చెప్పారు.

“50 శాతం దామాషా ప్రకారం, మిగతా 50 శాతం జీఎస్డీపీ ప్రాతిపదికన ఇవ్వండి. ఏకాభిప్రాయానికి రండి. మొదట మహిళా రిజర్వేషన్లను ఆమోదించండి. నియోజకవర్గాలను పెంచడానికి నిపుణుల కమిటీని నియమించండి. నివేదికను సభల్లో చర్చకు పెట్టండి. రాష్ట్రాల అసెంబ్లీల అభిప్రాయాలను తెలుసుకోండి.

జనగణన కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున అవి పూర్తయ్యే లోగా అందరి అభిప్రాయాలు తీసుకుని నియోజకవర్గాల పెంపు, పునర్విభజన ప్రాతిపదికను నిర్ణయించండి. 2028 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. అనవసరమైన గందరగోళానికి తెరలేపొద్దు” అని ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్పారు.

Demanding a shift in how democratic representation is calculated, Hon’ble Chief Minister of Telangana Sri A. Revanth Reddy has called for the delimitation and expansion of legislative seats to be conducted via a GSDP-based hybrid model. While affirming his full support for the immediate rollout of 33% reservation for women, he cautioned that the Centre’s current proposal for increasing Lok Sabha and Assembly seats could deepen the divide between Northern and Southern states, potentially impacting national stability.

To address these concerns, the Chief Minister proposed a hybrid allocation framework centered on Gross State Domestic Product (GSDP). Under this plan, 50% of additional seats would be distributed on a pro-rata basis, while the remaining 50% would be allocated based on a state’s contribution to the Gross National Product (GNP), ensuring that states driving the nation’s economic engine are given due priority.

He further asserted that women’s reservation and the expansion of constituencies are distinct issues and should not be conflated. He urged the government to implement the gender quota immediately rather than using the 2026 census as a pretext for delay.

There is growing concern that a unilateral increase in seats based solely on outdated metrics would lead to systemic discrimination against Southern states and threaten the political relevance of smaller regions. He noted that a significant disparity in representation between states like Uttar Pradesh and those like Kerala or Telangana would inevitably result in political inequality.

Highlighting the economic contributions of the South, he questioned why states driving the country’s growth should be penalized with reduced political weight due to successful population control. He emphasized that the South should not be relegated to being the nation’s “financial capital” while political power remains concentrated in the North.

To find a balanced path forward, he recommended convening an all-party meeting and establishing an expert committee to incorporate the perspectives of State Assemblies. He concluded that a consensus-driven, comprehensive criterion must be finalized before the anticipated completion of the census in 2028.