Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the inauguration of MPPS & ZPHS Girls School Building at Kodangal.

రెండు సంవత్సరాలపాటు సహకరించి వెసులుబాటు కల్పిస్తే పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి ఉపాధ్యాయులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మంత్రి దామోదర రాజనర్సింహ గారు, ప్రభుత్వ సలహదారు కే కేశవరావు గారు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

భారతదేశ మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోల్చితే విద్యా శాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు సమయం ఇవ్వండి. రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండేండ్లలో సమస్యలన్నింటినీ సామరస్యంగా మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టం చేశారు.

“తెలంగాణ విద్యా వ్యవస్థను భారతదేశానికి ఒక రోల్ మాడల్‌గా నిలబెడుదాం. అందుకు కథానాయకులు ఉపాధ్యాయులే. అందుకు ఉపాధ్యాయులంతా పునరంకితం కావాలి. ఇంట్లో సొంత పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో మీ వద్ద చదువుకుంటున్న విద్యార్థుల విషయంలోనూ అంతే శ్రద్ధ పెట్టాలి. ఉపాధ్యాయులపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.

ప్రభుత్వ సర్వీసులో మీరు 30 ఏళ్లకు పైగా సేవలందిస్తారు. రాజకీయ నాయకులం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మీముందుకొచ్చి పరీక్షలు రాయాల్సిందే. నేను చెప్పిన ప్రకారం చేయకుండా ఉంటే.. నిర్ణయం తీసుకోవలసింది మీరే. అందుకు మార్కులు వేయాల్సిందీ మీరే. మీ చేతిలోనే కలం ఉంది. మీ చేతిలోనే బలం ఉంది” అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు.

“ఉపాధ్యాయులే వీధుల్లోకి వస్తే ప్రభుత్వానికి, రాష్ట్రానికి శుభ సూచకం కాదు. మిగతా శాఖలు వేరు. పిల్లల భవిష్యత్తుకు నిర్దేశకులు మీరు. మీరే ధర్నాలు చేస్తానంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండేళ్లు సమయం ఇవ్వండి.

ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అణాపైసా కష్టం రానివ్వను. పీఆర్సీ, ఇంక్రిమెంట్‌లతో పాటు మిగతా సమస్యలు వేటిలోనూ చిన్న కష్టం రానివ్వను. సలహాదారు కేశవరావు గారితో కూర్చొని మాట్లాడండి. నన్ను విశ్వసించి సహకరించండి” అని విజ్ఞప్తి చేశారు.

“గత ప్రభుత్వంలో పదేండ్ల పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. విధ్వంసం చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే శక్తి ఉపాధ్యాయులపైనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 80 వేల అడ్మిషన్లు పెరిగాయంటే ఆ గొప్పతనం ఉపాధ్యాయులదే.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి వివాదం లేకుండా బదిలీల ప్రక్రియ పూర్తి చేశాం. జీవో 317 కింద తలెత్తిన సమస్యలను పరిష్కరించాం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించాం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కాదు ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపించాం.

దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్ నియమించి ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఉపాధ్యాయుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుని సాంకేతిక నైపుణ్యంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాం.

ప్రభుత్వ విధానంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి. మనమంతా లక్షలాది విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. సహకరించండి. నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుంది” స్పష్టంగా చెప్పారు.

“జాతీయ విద్యా విధానంతో విద్యా రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. మనం కూడా విధానాలు మార్చుకోవాలి. నిరుపేద పిల్లలు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. కాలం తీరిపోయిన విద్యా విధానంతోనే వెళదామా. అప్ డేటెడ్ విద్యా విధానాన్ని అందిపుచ్చుకుందామా?

పాలిటెక్నిక్ కాలేజీలు టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తేస్తే, ప్రైవేటీకరణ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం వల్ల ఈరోజు ఫలితాలను చూస్తున్నాం.

పాలిటెక్నిక్‌లో రెండేళ్లు థియరీ, మూడో సంవత్సరం కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్న్‌గా పనిచేసే విధానం తీసుకొస్తున్నాం. ఇంటర్న్‌గా ఉన్నప్పుడు కార్పొరేట్ కంపెనీలు రూ. 9 వేల వరకు స్టయిఫండ్ కూడా ఇస్తాయి.

పాలిటెక్నిక్ ఇప్పటివరకు డిప్లమాలే జారీ చేస్తున్నాయి. విదేశాల్లో మాస్టర్స్ చదువుకోవడానికి వీలుగా డిగ్రీ పట్టాను అందించే విధంగా మార్పులు చేశాం. పాలిటెక్నిక్ పూర్తి చేస్తే ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరడానికి అవకాశం కోల్పోతామన్న తప్పుడు ప్రచారంపై విద్యార్థులు మోసపోవద్దు. నిస్సందేహంగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరడానికి వీలుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు.

అలాగే లెక్చరర్లకు సర్వీసు నిబంధనల విషయంలోనూ ఎలాంటి ధోకా ఉండదు. సర్వీస్ రూల్స్ వేరు, విద్య విధానం వేరు. ఈ విషయంలో ఇంకా అనుమానాలు ఉంటే సలహాదారు కేశవరావు గారితో కూర్చొని మాట్లాడండి. ప్రభుత్వం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. జీతభత్యాలు, పీఆర్సీ, ఇంక్రిమెంట్లు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది” అని విస్పష్టం చేశారు.

“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో స్కిల్స్ నేర్పించడానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఏటీసీలు మార్చాం. కార్పొరేట్ కంపెనీల సమన్వయంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను ప్రారంభించాం.

నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య (నాలెడ్జ్ అండ్ కమ్యునికేషన్) ను అందించి 12వ తరగతి తర్వాత నైపుణ్యంలో శిక్షణ ఇప్పించాలి. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రపంచంలో రాణించగలరు. ఇంజనీరింగ్ పట్టా ఉన్న వారికన్నా నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి” అని వివరించారు.

“ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ మారింది. స్కిల్స్ ఉన్నవారికి జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. స్కిల్స్ తర్వాత ఇన్నొవేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ వైపు దృష్టి సారించాలి. యూనికార్న్‌గా నిలబడాలి. ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఈనాడు ఎలాన్ మస్క్ కంపెనీతో పోటీ పడుతోంది. ఇన్నొవేషన్‌పై ఫోకస్ పెట్టాలి.

ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది. వాటన్నింటికీ వారధి, సారథులు ఉపాధ్యాయులే. రెండేళ్లు ఫోకస్డ్‌గా పనిచేయండి. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకోండి. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిద్దాం” అని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

“పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. విద్యా రంగంలో జాతీయ సగటులో 28 స్థానంలో ఉన్న తెలంగాణను 17వ స్థానానికి ఎదగడం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైంది. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 80 వేలకు పైగా విద్యార్థులు అధికంగా అడ్మిషన్లు తీసుకున్నారంటే ఆ విజయానికి టీచర్లే కారణం.

30-35 ఏళ్లు కష్టపడి ప్రజలకు సేవలు అందించి రిటైరైన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వకపోగా పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 చేయడం వల్ల 2025 నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి. గత ప్రభుత్వం దాదాపు 8 వేల కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెడితే, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ నిధులను కూడదీసి వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చెల్లించాం” అని గుర్తుచేశారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy assured teachers that the government will resolve all their issues, including PRC and increments, within two years, and appealed to them to give the government two years of cooperation to transform Telangana’s education system into a role model for the country. He said the government is undertaking comprehensive reforms to secure a better future for underprivileged children and called upon teachers to be active partners in this transformation.

Participating in Teachers’ Day celebrations at the Government Junior College in Kodangal, the Chief Minister paid floral tribute to Dr. Sarvepalli Radhakrishnan and greeted teachers. Speaker Gaddam Prasad Kumar, Minister Damodar Rajanarsimha, Government Advisor K. Keshava Rao, public representatives, officials and students participated.

“Give us two years. I will take responsibility for resolving all issues of teachers and lecturers, including PRC and increments. I have complete faith in teachers. You are the heroes in making Telangana’s education system a role model for India,” the Chief Minister said.

He said the government had completed teacher transfers, resolved GO 317 issues and pending promotions, and sent teachers abroad to study best practices. An Education Commission has been constituted to bring a new education policy.

The government is bringing polytechnic education under the Skills University, with third-year corporate internships and stipends of up to ₹9,000. Students will also be able to pursue a degree, while the opportunity to join the second year of engineering will continue unchanged.

ITIs are being transformed into Advanced Technology Centres with focus on skills, innovation and employment. The Chief Minister said the rise of Telangana from 28th to 17th in the national education ranking and the addition of over 80,000 students in government schools reflect the efforts of teachers. He also recalled that ₹6,000 crore was paid towards pending retirement benefits.