ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో యుకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు లార్డ్ కరణ్ బిలిమోరియా గారి నేతృత్వంలోని 30 మంది యూకే బిజినెస్ స్కూల్స్ ప్రతినిధుల బృందం సమావేశమైంది.

ప్రపంచ ప్రఖ్యాత ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌’గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని యూకే బిజినెస్ స్కూల్స్ ప్రతినిధుల బృందం భేటీలో అన్నారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో నిర్వహించిన భేటీలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా గారు, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ గారు, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈఓ ఫ్లోరా హమిల్టన్ గారు, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రతినిధులతో సహా 30 మంది వివిధ యూకే విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వివిధ యూకే బిజినెస్ స్కూల్స్‌కు చెందిన డీన్లు, ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తూ, విశ్వవిద్యాలయాల అవసరాలకు తగ్గట్టు అన్ని విధాల సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి పలు ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయని చెప్పారు.

విదేశీ విద్యాసంస్థల రాకతో స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి పని చేయడానికి, ఇక్కడే పరిశోధనలకు దోహదపడుతుందని అన్నారు. యూకే బిజినెస్ స్కూల్స్ తెలంగాణలో ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్ వ్యాపార సంస్థలు రాష్ట్రం వైపు చూస్తాయని పేర్కొన్నారు.

అదే సమయంలో రాష్ట్ర విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ అనుభవం, ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఈ దిశగా హార్వర్డ్, ఎంఐటీ, లండన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్, నార్త్‌ఈస్టర్న్ విశ్వవిద్యాలయం వంటి అనేక ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన వంటి రంగాల్లో భాగస్వామ్యాలు ప్రారంభించవచ్చని అన్నారు.

విద్యార్థులకు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో, దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుతో భావితరాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

డిసెంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతినిధి బృందానికి ఆహ్వానం పలికారు. యూకే విద్యా వ్యవస్థలోని ముఖ్యులందరికీ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

దావోస్‌లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరహాలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించనుంది. లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టిందన్నారు.

ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయాలు, ఫార్చూన్-500 కంపెనీలు తెలంగాణలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, అలాగే ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటి ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలను ప్రతినిధి బృందానికి వివరించారు.

Harvard University will offer Executive Education programmes in Hyderabad from December, marking a major step towards establishing Telangana as a ‘Global Knowledge Hub’, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said.

At a meeting with a 30-member delegation of UK business schools led by House of Lords member Lord Karan Bilimoria, the Chief Minister outlined Telangana’s plans to attract leading international universities and expand global academic partnerships. Potential collaborations with Harvard, MIT, University of London, Virginia Tech and Northeastern University include executive programmes, dual degrees, faculty training and research.

International institutions in Telangana are expected to create global opportunities for students and faculty, strengthen industry-academia collaboration and attract global companies. The government is also establishing Young India Skills University and an Education Hub in Bharat Future City to provide advanced, industry-oriented skills.

The Chief Minister invited the UK delegation to the Invest Telangana Global Summit 2026 in December and outlined the vision of a $1 trillion economy by 2034 and $3 trillion economy by 2047.