Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Foundation Stone Laying Ceremony of Indiramma Indlu in CURE Area | Indiramma Towers at KPHB Colony, Kukatpally, Hyd.

నిషేధిత జాబితాల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. నిషేధిత జాబితా (22 A) చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కోర్ అర్బన్ (CURE) ప్రాంత పరిధిలో హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో పాటు ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, నిషేధిత జాబితాలో పెట్టిన భూముల సమస్యను ప్రస్తావించారు.

“భూమి కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవు. నేను హామీ ఇస్తున్నా. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి సర్వే నంబర్‌లో వచ్చిన మొత్తం భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. కోర్టు కేసులున్న స్థలాల వరకు పక్కనపెట్టి మిగతా వాటికి బైనెంబర్లు ఇచ్చి పరిష్కరిస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..” అని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

“కూకట్‌పల్లి ప్రాంత ప్రజలకు ఏం కావాలన్నా పనులు చేయించుకోండి. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, విద్య కోసం పాఠశాలలు, కాలేజీలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అవసరమున్న పరిశ్రమల విషయంలోనైనా నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాలి” అని ముఖ్యమంత్రి గారు వేదికపైనున్న మంత్రి శ్రీధర్ బాబు గారికి సూచించారు.

“అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు కూడా గత పాలనను, ఈ రెండేళ్ల పాలనను బేరీజు వేసుకోవాలి. గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వేటినీ నిలిపివేయలేదు. అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం” అని సంక్షేమ పథకాలను వివరించారు.

“రాష్ట్రంలో 3.28 కోట్ల మంది ప్రజలకు ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నాం. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రూ. 500 లకే సిలిండర్ అందజేస్తున్నాం. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశాం.

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఉద్యోగ, ఉపాధి కోసం చదువుల కోసం వెళ్లేవారు నెలకు ఆరేడు వేలు ఆదా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీకి 12 వేల కోట్లు చెల్లించాం. స్వయం సహాయక సంఘాలు 65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ఇచ్చి రూ. 2500 కోట్ల వడ్డీ చెల్లించాం.

మహిళా సంఘాల పేరిట వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకిప్పించాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం కల్పించాం. ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులను విక్రయించుకోవడానికి శిల్పారామంలో మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా బజార్ల ఏర్పాటుకు విలువైన స్థలమిచ్చాం.

రెండేండ్లు తిరిగేలోపు ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల్లో రెండేళ్లు తిరిగేలోపు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువ చేసే 11 ఎకరాల భూమిలో మంచి సంకల్పంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మించే అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. నగరంలో నిరుపేదలు ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో వారికి అక్కడే ఇండ్లు ఇవ్వాలని సంకల్పించాం.

పేదల కోసం నిర్మించే ఇండ్లకయ్యే రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మంత్రులకు సూచించారు. ఇప్పుడు నిర్మించే ఇళ్లకు సంబంధించి నిరుపేదలకు స్థలం మొత్తం ఉచితంగా అందిస్తున్నాం. నిర్మాణానికి అయ్యే వ్యయంలో ఐదారు లక్షలు లబ్ధిదారులు భరిస్తే నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎలా సాగుతుందో ఎప్పుడైనా పరిశీలించే హక్కుదారులవుతారు” అని వివరించారు.

“నిరుపేదలు ఉండటానికి ఉండడానికి సొంత ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నాం. సొంతింటి కల నెరవేరడానికి నూటికి నూరు శాతం అండగా నిలబడుతాం. మొదటి విడతగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ లాంటి అత్యధికంగా పేదలు ఉండే ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి పనులు చేయడానికి ఇక్కడికి వలసలు వచ్చిన ప్రాంతాల్లో ఉండటానికి మంచి ఇల్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది.

గతంలో ఏదైనా పని చేయాలంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్.. ఇలా తిరగడానికే సమయం సరిపోయేది. అందుకే ప్రజల సౌలభ్యం కోసం సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశాం” అని చెప్పారు.

“మీ అభివృద్ధి కోసం నిలబడుతా. పది మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. మంచి చేయడానికి చిత్తశుద్ధి కావాలి. మంచి ఆలోచన కావాలి. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేయడానికి దేవుడు శక్తినిచ్చారు. అందుకు ప్రజలు.. మీరూ ఆశ్వీర్వదించండి” అని ముఖ్యమంత్రి గారు కోరారు.

Land rights holders need not worry about lands included in the prohibited list, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy assured. He said survey numbers of lands under Section 22-A would be assigned sub-numbers to resolve the issues, while lands under court cases would be kept aside.

The Chief Minister laid the foundation stone for Indiramma Indlu (Towers) in KPHB Colony, Kukatpally, under the Core Urban Region (CURE). Ministers Sri Ponguleti Srinivas Reddy, Sri Duddilla Sridhar Babu and Sri Ponnam Prabhakar, along with public representatives, attended the programme. He directed Minister Sridhar Babu to focus on roads, flyovers, lake restoration, education, industries and employment in Kukatpally.

The government is providing fine rice to 3.28 crore people, 200 units of free power, LPG cylinders at ₹500 and free bus travel for women. Self-Help Groups have received ₹65,000 crore in bank-linkage loans, while 70,000 government jobs have been filled in the last two years.

The government is taking up Indiramma Towers to provide quality homes to the urban poor, with free land for beneficiaries and registration charges proposed to be waived. The first phase will focus on areas with a high concentration of poor families, including Kukatpally, Quthbullapur, Medchal, Cantonment, LB Nagar and Uppal. The Chief Minister assured full support in fulfilling the dream of owning a home and taking Telangana towards development.