Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Invest Telangana Global Summit 2026 Curtain Raiser at New Delhi.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు త‌మ ప్ర‌భుత్వం అండగా నిలుస్తుంద‌ని, రాష్ట్రంలో ప్రతి పెట్టుబడికి త‌న‌ది భ‌రోసా అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. “పెట్టుబడుల విషయంలో విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వ సహకారం, అవసరమైన మద్దతు అందించే బాధ్యతను నేను తీసుకుంటా” అని పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా చెప్పారు.

న్యూఢిల్లీలో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026 కర్టెన్ రైజర్‌లో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ కల్పిస్తున్న భద్రత, అవకాశాలు, సానుకూల పరిస్థితులను అందిపుచ్చుకోవాలంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “పెట్టుబడిదారులకు ఒక విజ్ఞప్తి. తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో మనసులో ఒక సంఖ్యను నిర్ణయించుకుని ఆ మొత్తాన్ని రెట్టింపు చేయండి. అందుకు మీరు ఆశిస్తున్న వృద్ధి రేటును, లాభాలనూ రెట్టింపు చేయండి. అందుకు నా నుంచి ఏం కావాలో చెప్పండి.

తెలంగాణలో పెట్టుబడులకు భద్రత కల్పించడం, అవి వృద్ధి చెందేలా చూడడం నా వ్యక్తిగత బాధ్యత. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటాను” అని స్పష్టంగా చెప్పారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ 2026’లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అందరికీ ఆహ్వానం పలికారు.

“వ్యాపార రంగంలో నాకంటే మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. పెట్టుబడిదారుల అభిప్రాయాలను వినడానికి వచ్చాను. మీ నుంచి నేర్చుకుంటాం, మీ అభిప్రాయాలను అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెడతాం. పారిశ్రామిక అవకాశాలను విస్తరించి పెట్టుబడిదారులకు తమ గమ్యంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడమే నా పని” అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

“వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాం. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, అందులో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలి. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉంది.

2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. తెలంగాణ అభివృద్ధికి మీ ఆలోచనలను అందించండి. మంచి విధానపరమైన సూచనలు చేయండి. మీరందించే సూచనలను పరిశీలించి, వాటిని ప్రభుత్వ విధానాలుగా అమలు చేస్తాం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కావాలి…” అని కోరారు.

కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు పేర్కొంటూ.. “కేంద్ర ప్రభుత్వం దేశంలో 7 హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, అందులో 3 హైదరాబాద్‌కు అనుసంధానం కానున్నాయి. హైదరాబాద్‌ – చెన్నై, హైదరాబాద్‌ – బెంగళూరు, హైదరాబాద్‌ – పుణె మార్గాల్లో ఈ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి.

వరంగల్‌, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణం ద్వారా కూడా కేంద్రం తెలంగాణకు సహకరిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మెట్రో రైలు విస్తరణ వరకు, నేవీ రాడార్ కేంద్రం నుంచి అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల వరకు కేంద్రం నుంచి సహకారం పొందుతున్నాం..” అని వివరించారు.

హైదరాబాద్ నగర చారిత్రక వైభవం, ఇక్కడి మౌలిక సదుపాయాలు, మేధోసంపత్తిని ఉదాహరణలతో వివరిస్తూ, హైదరాబాద్ నగరం న్యూయార్క్‌, లండన్‌, టోక్యో, సియోల్‌, దుబాయ్‌ వంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ఈ సన్నాహక కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, సీఐఐ తెలంగాణ చైర్మన్ ఎం. గౌతమ్ రెడ్డి గారు, సీఐఐ ప్రెసిడెంట్ (డెసిగ్నేట్), భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా కె. ఎల్లా గారు మాట్లాడారు. మంత్రులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, వాకిటి శ్రీహరి గారు, అజారుద్దీన్ గారు, పలువురు ప్రజాప్రతినిధులు పారిశ్రామిక దిగ్గజాలు కార్యక్రమానికి హాజరయ్యారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy assured industrialists of Telangana’s full support for their investments, promising personal responsibility for their security, growth and the necessary policy support.

Addressing the curtain raiser for the Invest Telangana Global Summit 2026 in New Delhi, the Chief Minister urged investors to double their proposed investments, growth expectations and profit targets, assuring them of his personal support in achieving their goals.

Hon’ble Union Minister for Commerce and Industry Piyush Goyal attended the programme as the Chief Guest.

The Chief Minister invited investors to the Global Summit, scheduled for December 7–9 at Bharat Future City in Hyderabad, and urged them to share ideas and policy suggestions to strengthen the state’s industrial growth.

Outlining the Telangana Rising 2047 vision, aligned with Viksit Bharat 2047, Sri Revanth Reddy said the state aims to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. He stated that Telangana should contribute 10 per cent to India’s projected $30 trillion economy by 2047, compared with its current 5 per cent share of the national GDP.

Highlighting Centre-state cooperation, the Chief Minister noted that three proposed high-speed rail corridors would connect Hyderabad with Chennai, Bengaluru and Pune. He also cited the proposed airports at Warangal and Adilabad, the Regional Ring Road, metro rail expansion and the Navy radar centre as key development initiatives receiving support from the Centre.

Highlighting Hyderabad’s historical legacy, infrastructure and intellectual capital, the Chief Minister said the city should compete with leading global destinations such as New York, London, Tokyo, Seoul and Dubai.

Minister Duddilla Sridhar Babu, Chief Secretary Sanjay Jaju, CII Telangana Chairman M. Gautam Reddy and CII President-Designate and Bharat Biotech Managing Director Suchitra K. Ella addressed the gathering. Ministers Dr. Vivek Venkataswamy, Vakiti Srihari and Mohammad Azharuddin, public representatives, diplomatic mission representatives, CII members and leading industrialists attended the programme.