ఎల్‌నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ప్రకోపించడంతో తలెత్తిన ఈ విపత్తును ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని కోరారు.

ఎల్‌నినో వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరిస్థితి తీవ్రతపై ఆ సమావేశంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.
ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో అఖిల పక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి సహకారం కోరుతామని చెప్పారు. ఈ సంక్షోభ కాలం నుంచి గట్టెక్కడానికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు.
ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, సాగు, తాగునీటి ఎద్దడి, తద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, దనసరి అనసూయ సీతక్క గారు, వివేక్ వెంకటస్వామి గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల రావు గారితో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎల్‌నినో కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవలసిన చర్యలపై ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి గారు వివరించి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు పెద్ద మనసుతో ఎండాకాలం పంటలు వేయడం తగ్గించుకోవాలి. ఒక సీజన్ పంట పండించే పనులను వాయిదా వేసుకొని, ఉన్న నీటిని తాగడానికి వినియోగించుకోవాలి.
ఎల్‌నినోను ఎదుర్కొనడానికి ప్రజలకు అండగా నిలబడాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, తప్పుడు ప్రచారం నమ్మి వరి పంటలు వేస్తే నీరు అందించలేక పంటలు ఎండిపోయి పెట్టుబడి నష్టపోవడమే కాకుండా మోటార్లు, మీటర్లు కాలిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. పెద్దమనసుతో ఒక సీజన్‌ను వాయిదా వేసుకోవాలి.
రైతులతో పాటు ఈ సంక్షోభ పరిస్థితుల్లో భూమిలేని నిరుపేద కూలీలను ఆదుకోవలసిన అవసరం ఉంది. ఈసారి 2.5 లక్షల మంది ఉపాధి హామీ కూలీ పనులకు వస్తున్నారు. ఉపాధి హామీ పనుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి గారికి సూచించడం జరిగింది.
ప్రస్తుత కాలంలో పంట నష్టపోయిన వారికి, ఎండాకాలంలో వాయిదా వేసుకునే పంట నష్టానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిధి నుంచి సహకారం అందించాలి.
మార్చి నెలలో ఉండే ఎండలు ఇప్పుడే ఉన్నాయి. 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న కాలంలో నీరు, విద్యుత్ విషయంలో తీవ్ర సమస్య ఎదుర్కోబోతున్నాం.
ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, ఆరుతడి పంటలు వేసుకోవాలని వర్షాకాలం ప్రారంభం నుంచి చెబుతూవచ్చాం. గడిచిన 3 సంవత్సరాల్లో సగటున 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈరోజు 20 వేల మెగావాట్లకు చేరుకుంది.
2014-15 నాటికి సగటున 6500 – 7,000 మెగావాట్ల వినియోగం ఉండగా, ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల వినియోగం పెరిగింది. గడిచిన రెండేళ్లలో ఆరేడు వేల వినియోగం పెరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా రైతులకు, పరిశ్రమలకు వీలైనంత మేరకు విద్యుత్ అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం.
ఇంకో 15 – 20 రోజుల్లో వర్షాకాలం పంటలు కోతలు అయిపోతాయి. చేతికొచ్చిన పంట ఎండిపోకూడదు. రైతుకు నష్టం, కష్టం రాకూడదు. రైతును ఆదుకోవాలనే ఆలోచనతో.. మార్కెట్లో ఎక్కడ, ఏ రేటుకు దొరికినా విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
తెలంగాణ మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉత్పత్తికన్నా వినియోగం పెరగడంతో విద్యుత్ లభించని పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం.
చలికాలం ప్రారంభానికి ముందే రిజర్వాయర్లు వట్టిపోయే పరిస్థితులు వచ్చాయి. పోయిన సంవత్సరం ఇదే సమయానికి రిజర్వాయర్లలో 462 టీఎంసీల నీరుండగా, ఇప్పుడు 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
అందుబాటులో ఉన్న నీటిని రాబోయే జూన్ వరకు 8 నుంచి 10 నెలలు పొదుపుగా వాడుకోవలసిన అవసరముంది. తాగునీటికే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది.
ప్రపంచంలోని దాదాపు వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా తీవ్రమైన నీటి ఎద్దడి, ఎండ వేడిమితో పాటు రకరకాల సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు.
ప్రజలు, ముఖ్యంగా రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎల్‌నినో ప్రభావం మొదటగా రైతాంగంపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సాగునీరు, తాగునీరుతో పాటు విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. తద్వారా పరిశ్రమలు, ప్రజా జీవితం, దినసరి కార్యక్రమాలపైన కూడా తీవ్రమైన ప్రభావం పడనుంది.
కనీవినీ ఎరుగని విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఉత్పత్తి చేయగలిగిన రాష్ట్రాల నుంచి కేంద్రం సెంట్రల్ పూల్ నుంచి రాష్ట్రానికి సబ్సిడీపై అదనంగా విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన అవసరాలకు అనుగుణంగా రాబోయే 10 నెలల వినియోగం ఎంత అవసరమో అంచనా వేసి అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆశిస్తున్నాం.
ఈ విపత్తు సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, సంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి. ఈ ప్రకృతి విపత్తును జయించడానికి అందరి సహకారం కావాలి.
ఎల్‌నినో విపత్తుకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఎవరూ వ్యాప్తి చేయొద్దు. ఎల్‌నినో కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో 24 గంటల పాటు ప్రజలకు సరైన సమాచారం అందించడానికి ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాం. అపోహలు, తప్పుడు ప్రచారం కల్పించకుండా ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ఒక వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం.
సాగునీరు, తాగునీటిని ఆదా చేసుకోవడం, కూలీలకు పనులు కల్పించడంతో పాటు పశువులకు గ్రాసం, తాగునీరు అవసరాలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్య పరంగా ఏ కష్టమొచ్చిన నిరుపేదలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నాం. అని ముఖ్యమంత్రి గారు సవివరంగా తెలిపారు.
ఈ విపత్తు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సబ్ కమిటీని నియమించారు. అలాగే ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారికంగా సమాచారం అందించడానికి సీఎం సలహాదారు కే. రామకృష్ణా రావు గారిని నోడల్ అధికారిగా నియమించారు.
Telangana Prepares to Tackle El Niño Challenges
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy has called for collective action to address the anticipated impact of El Niño on agriculture, water availability, and electricity supply.
During a high-level review meeting at the Dr. B. R. Ambedkar Telangana State Secretariat, the Chief Minister directed all departments to remain vigilant and prioritise water conservation, farmers’ welfare, rural employment, and public safety.
Key measures include promoting judicious water use, ensuring power supply to farmers, supporting rural labourers, and strengthening public awareness and emergency preparedness. The government will also seek the cooperation of the Central Government and all political parties to tackle the emerging challenges.
Together, we can protect farmers, conserve resources, and safeguard the well-being of every citizen.
