తెలంగాణలో నిర్మించనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు పౌర విమానయాన శాఖ కార్యాలయంలో కేంద్రమంత్రితో సమావేశమై రెండు విమానాశ్రయాలపై చర్చించారు.

ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలతో పాటు నల్గొండ జిల్లాలకు వరంగల్ కేంద్రంగా ఉంటుందని తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టు, రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండడంతో పాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలతో నగరం కీలకంగా మారుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్‌ను పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
వరంగల్ విమానాశ్రయంలో MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్), ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేసినందున టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు. 2028, జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై చర్చించారు. వరంగల్‌కు ఘనమైన చరిత్ర ఉన్నందున, కాకతీయ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్లు ఉండాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. అందుకు కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్ తో పాటు పౌర విమానాశ్రయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. రెండు ఎయిర్‌పోర్ట్‌లకు అవసరమైన భూమిని సేకరించి అందజేస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. వరంగల్ విమానాశ్రయం తరహాలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లోనూ ఎంఆర్‌వో, ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులు నెలకొల్పాలన్నారు. వరంగల్, ఆదిలాబాద్ రెండు విమానాశ్రయాల్లోనూ విమాన శిక్షణ సంస్థలు (FTO) నెలకొల్పాలని కోరారు.
హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సీప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాలన్న ముఖ్యమంత్రి గారి సూచనలపై అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర మంత్రి గారు కోరారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్-అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు గారితో పాటు పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయాలు ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీడియాతో వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో తమకు సహకరిస్తుందని, ఎక్కడైనా సమస్యలుంటే కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తున్నామని తెలిపారు. ఏవైనా సమాచారలోపం ఉంటే దానిని పరస్పరం మార్చుకోవడం ద్వారా అధిగమిస్తున్నామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనంత త్వరగా తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ చేసి ఇచ్చి చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు అభినందించారు. భూ సేకరణ విషయంలో త్వరగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ సంస్కృతికి అద్దం పట్టేలా విమానాశ్రయ డిజైన్ ఉంటుందని చెప్పారు.
New Delhi: Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Civil Aviation Minister Shri Kinjarapu Ram Mohan Naidu in New Delhi and urged the Centre to develop the proposed Warangal (Mamnoor) and Adilabad airports to international standards.
The Chief Minister highlighted Warangal’s strategic importance for North Telangana and requested the inclusion of MRO (Maintenance, Repair & Overhaul), air cargo and hangar facilities. He sought early commencement of works and completion of the airport by June 2, 2028. He also proposed designs reflecting the rich Kakatiya heritage and culture.
For Adilabad, the Chief Minister requested the development of a civil airport alongside the proposed defence airport and assured full support for land acquisition. He also sought MRO, air cargo, hangar facilities and Flight Training Organisations (FTOs) at both airports.
The Chief Minister further suggested exploring seaplane connectivity between Hussain Sagar and Prakasam Barrage. The Union Minister asked officials to submit the necessary proposals.
Speaking to the media, Shri Revanth Reddy said development should rise above politics and emphasized the State Government’s constructive engagement with the Centre on key projects.
Union Minister Ram Mohan Naidu appreciated the Telangana Government for expeditiously completing land acquisition for the Warangal airport and said the airport’s design would reflect the cultural identity of Warangal.
