Hon’ble CM Sri A. Revanth Reddy participated in Police Flag Day Parade at Police Martyrs Memorial, Goshamahal.

వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.

వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.

“పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్‌లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులను పరామర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శింగా నిలిచారని అభినందించారు.

ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు, పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. ఇటీవలి కాలంలో కొందరు కీలక మావోయిస్టు నాయకులు లొంగిపోయిన అంశాన్ని ప్రస్తావిస్తూ మిగిలిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

“పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయరు. నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.

పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము వంటిదే. పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే, ప్రతి దినం పోరాటమే. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తు, వీఐపీల రక్షణ.. ఇలా సవాలక్ష బాధ్యతలతో విరామం లేకుండా పని చేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు.

మన ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మా ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేశాం.

సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించాం.

విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్లలోను పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం.

తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్‌గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలను, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు 2 కోట్ల రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. 3 రోజుల కింద నిజామాబాద్ లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారు.

భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. 1 కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ వేతనంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం.

వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ సంక్షేమం నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం.

ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది. అలాగే, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది. ఈ విజయాలు తెలంగాణ పోలీస్‌ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనం.

తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌ల సారధ్యం వహించడం మా ప్రభుత్వానికి గర్వకారణం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే.

ఆ బాధ్యతతోనే పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. అందులో భాగంగా పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించాం.

పోలీస్‌ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నాను. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసింగ్ కు మూల స్థంభాలు. ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరికి చేయడంతోపాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందిస్తాయి. సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్‌ను అనుసరించాలి..” అని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఆయా విభాగాలకు చెందిన ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పోలీసు సురక్ష రూపొందించిన “అమరులువారు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy called upon anonymous leaders of Maoist and other left-wing extremist movements to join mainstream public life and contribute to the country’s development. He clarified that friendly policing is meant for law-abiding citizens, not lawbreakers.

On Police Commemoration Day,, the Chief Minister participated in the Police Flag Day Parade at Gosha Mahal and paid tribute to policemen who sacrificed their lives in the line of duty.

He visited families of fallen officers, acknowledging their sacrifices and congratulating Telangana Police for setting a benchmark in peace and security.

The Chief Minister highlighted the challenges of police duties, including crime control, investigation, traffic management, day/night patrols, VIP protection, and overall public safety.

Government initiatives include recruitment of 16,000 constables and sub-inspectors, highest compensation in the country for officers killed or injured in the line of duty, housing, free education for children, medical support, and special seats in medical institutions for children of martyrs.

Ex-gratia amounts announced: Rs. 1 crore for constables to ASIs, Rs. 25 crore for SIs and CIs, Rs. 50 crore for DSPs and Addl. SPs, and Rs. 2 crore for SPs and other IPS officers.

Special support announced for CCS Constable Empalli Pramod Kumar’s family: Rs. 1 crore ex-gratia, last pay until retirement, government job for one member, 300-yard house plot, and additional ex-gratia of Rs. 24 lakh.

Telangana Police ranked first in India according to the India Justice Report 2025 and received special appreciation from the Ministry of External Affairs for passport verification.

Women IPS officers are leading key positions in Hyderabad, Cyberabad, and Rachakonda commissionerates.

The government is establishing special educational institutions for children of police personnel, including the Young India Police School in Manchirevu, Ranga Reddy district.

The Chief Minister urged continued performance, transparency, accountability, and ethical policing to maintain public trust and promote community-friendly policing.

State DGP Shri Shivdhar Reddy and senior officers participated in the program. The Chief Minister also released the book “Amaruluvaru” prepared by Police Suraksha.

#PoliceCommemorationDay#TelanganaPolice