హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్భాగం మొత్తంగా కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 2,100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ఏరియాలో 1 కోటి 35 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

సోలార్ మాడ్యూల్స్ తయారీ రంగంలో ప్రసిద్ధ ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో నెలకొల్పిన 5.6 గిగావాట్ల సామర్థ్యం కలిసిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.
ప్రిమియర్ ఎనర్జీ రూపొందించిన మొట్టమొదటి సోలార్ ఆక్సీ ట్రీ – సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్, ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ ‘ఆక్సీట్రీ’ని, యూనిట్‌లో సోలార్ మాడ్యూల్స్‌కు సంబంధించి వివిధ ఉత్పత్తులను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు.
ఈ యూనిట్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగానే చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
“ఆ నగరాల అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని జీడిమెట్ల, బాలానగర్ లాంటి ఇండస్ట్రియల్ పార్కులున్న ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, దానికితోడు మూసీ నది కాలుష్యంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అందుకే 2,100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఈ కోర్ అర్బన్ రీజియన్ లో పూర్తిగా కాలుష్యరహిత ప్రాంతంగా మార్చాలని సంకల్పించాం. పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించడానికి చట్టం చేశాం. ఓఆర్ఆర్ బయట పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో మాన్యుఫాక్చరింగ్ జోన్ గా గుర్తించాం. ఇక్కడి నుంచి తరలించిన పరిశ్రమలకు అవసరమైన స్థలాలను మాన్యుఫాక్చరింగ్ జోన్ లో కేటాయిస్తాం..” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.
“మాన్యూఫాక్చరింగ్ జోన్‌లో మొట్టమొదటగా ప్రారంభమైన సంస్థ ప్రీమియర్ ఎనర్జీ కావడం ప్రశంసనీయం. కేవలం 12 నెలల కాలంలో యూనిట్‌ను నెలకొల్పింది” అని ముఖ్యమంత్రి సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు.
“తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రాంతీయ మండళ్లుగా విభజించి సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం. 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నది మా సంకల్పం.
వైట్ కాలర్ ఉద్యోగాలు కష్టమైన పరిస్థితులను అర్థం చేసుకుని యువత బ్లూకాలర్ జాబ్స్ అందిపుచ్చుకునే దిశగా నైపుణ్యతను పెంచడానికి ఎక్కువ దృష్టి సారించాం. ఏటీసీలు, పాలిటెక్నక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి మొత్తంగా వ్యవస్థలను ఆ దిశగా సిద్ధం చేస్తున్నాం” అని చెప్పారు.
“హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇప్పుడున్న పెట్టుబడులు, పరిశ్రమలు సరిపోవు. మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు రావాలి. 2047 నాటికి వంద సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకోబోతున్న తరుణంలో వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ మొదలయ్యాం. ఎక్కడికి చేరుకోవాలనుకున్నామో ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లాలి.
పెరిగిన కాలుష్యాన్ని నియంత్రించడానికి సోలార్ ఎనర్జీతో ఆక్సిజన్ పంపింగ్ చేసే యంత్రాలను ప్రీమియర్ ఎనర్జీ రూపొందించడం అభినందనీయం. అలాంటి పరిస్థితులు తలెత్తడంపై అందరూ ఆలోచన చేయాలి. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల ఇలాంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది. నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అంతకన్నా ఎక్కువ ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉండాలి” అని ముఖ్యమంత్రి గారు కోరారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, కాలే యాదయ్య గారు, ప్రీమియర్ ఎనర్జీ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్ సలూజా గారు, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సింగ్ సలూజా గారు, డైరెక్టర్ సుధీర్ మూల గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవతి రోహిణి గారు, ప్రభుత్వ అధికారులు, సంస్థ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Transforming Hyderabad’s 2,100 sq. km Core Urban Region within the Outer Ring Road into a pollution-free and sustainable growth zone is a key priority of the Telangana Government, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said. Anchored in the Telangana Rising 2047 vision, the initiative seeks to balance rapid economic growth with environmental sustainability through green energy, world-class infrastructure, and planned urban development.
Premier Energies’ 5.6 GW next-generation solar module manufacturing facility was inaugurated at Sitarampur in Ranga Reddy district. Established in just 12 months, the facility is the first manufacturing unit to commence operations in the State’s proposed PURE zone, marking a significant milestone in Telangana’s clean-energy and industrial growth journey.
Addressing the gathering, Sri Revanth Reddy said Telangana is pursuing a long-term development strategy through the CURE, PURE and RARE framework, while fostering sustainable industrialisation, attracting investments, and creating future-ready employment opportunities. He also commended Premier Energies for its innovative clean-energy solutions, including the solar-powered OxyTree system, and reaffirmed the State’s commitment to building a greener, more sustainable and globally competitive economy.
