క్షేత్ర స్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణలో విద్యా రంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విద్యా వేత్తలు, నిపుణులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నూతన విద్యా విధానం రూపకల్పనలో పరిగణలోకి తీసుకోవలసిన పలు అంశాలను ఈ సందర్భంగా వివరించారు.
విద్యా రంగంపై అయ్యే వ్యయానికి ప్రభుత్వం వెనుకాడదని, ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించామని తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని వ్యయంగా కాక పెట్టుబడిగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు.
విద్యాభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కోరామని తెలిపారు. తెలంగాణ విద్యా విధానంలో సిలబస్ రూపకల్పన, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు.
విద్యా రంగంలో ఇప్పటి వరకు తాము చేసిన కార్యక్రమాలపై సంతృప్తి చెందడం లేదని, ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీల వరకు సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి గారు అన్నారు. రానున్న 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని చెప్పారు.
డిసెంబరు 9వ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని వెల్లడించారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకొని ఇందులో ఉన్న విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలని కోరారు. వివిధ ఫౌండేషన్లు, ఎన్జీవోల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు.
విద్యా రంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతున్నాయని, నర్సరీకి ప్రైవేటు పాఠశాలలో చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడడం విశ్లేషించారు.
ప్రభుత్వ పాఠశాలలు సైతం ఆ రకమైన ధీమా కల్పించగలిగితే తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారని, తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదని అన్నారు. గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం, నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వివరించారు. విద్యా రంగం ప్రాధాన్యతను గుర్తించినందునే ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశంలో విశ్వ విద్యాలయాలు, ఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించారని గుర్తు చేశారు.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఉన్న కాలంలో ఉద్యోగావకాశాలకు అనేక పరిమితులు ఉన్నాయని సీఎం అన్నారు. సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినప్పటికీ విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగకపోవడంతో వాటిని అందిపుచ్చుకోవడంలో మనం విఫలమవుతున్నామని ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలానుగుణంగా ఇంజినీరింగ్ కళాశాలలు వచ్చినందునే పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ రంగంలో మన యువత రాణిస్తున్నారని చెప్పారు. అయితే మన రాష్ట్రం నుంచి ఏటా బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో పది శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదన్నారు.
తగినంత నైపుణ్యం లేకపోవడమే అందుకు కారణమన్నారు. ఆ రంగంలో నైపుణ్యాలు పెంచడంతో పాటు ఇంకా పలు రంగాల్లో అవకాశాలు విస్తృతమైనందున ఆ అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టేలా వారికి ప్రమోషన్లు, బదిలీలు చేశామన్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం చేపట్టామని తెలిపారు.
మన విద్యా విధానం భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని సూచించారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను ఏటీసీ కేంద్రాలుగా మార్పు చేయడం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన జరిగిందన్నారు.
విద్యా వ్యవస్థ వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాకుండా నిరుపేదలకు ప్రయోజనకరంగా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులను అంతా ఒకటే అనే భావన కలిగించేలా విద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని అన్నారు. తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ విద్యా విధానం ఛైర్మన్ కేశవరావు గారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ.వి.సుబ్బారావు గారు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారితో పాటు నిపుణులు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, విద్యావేత్తలు ప్రొఫెసర్ కోదండరాం గారు, మోహన్ గురుస్వామి గారు, ప్రొఫెసర్ సుబ్బారావు గారు, సీఐఐ శేఖర్ రెడ్డి గారు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి గారు, అక్షరవనం మాధవరెడ్డి గారు, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి గారు, ఫ్రొపెసర్ గంగాధర్ గారు, విశ్రాంత ఐఏఎస్లు మిని మాథ్యూ గారు, రంజీవ్ ఆచార్య గారు, ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు తదితరులు మాట్లాడారు.
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy said that the Telangana Education Policy (TEP), designed to suit field conditions, studies and future needs, should act as a compass for India’s education system. He stated that a complete overhaul of Telangana’s education sector is necessary.
Speaking at a meeting with educationists and experts at the Dr. B.R. Ambedkar State Secretariat, the Chief Minister said the government would not hesitate to invest in education and is setting up a special education corporation to improve infrastructure and standards. He urged the Centre to treat education spending as an investment and requested Union Finance Minister Nirmala Sitharaman to remove educational loans from the FRBM limit.
He stressed that the new policy must address syllabus design, resource mobilization and implementation. Unsatisfied with progress so far, he said reforms are required from the primary level to universities, with the policy guiding the system for the next 25 years. The TEP will also feature in the Telangana Vision Document-2047 to be launched on December 9.
The CM observed that despite huge allocations, enrolments in government schools are declining as private schools attract students from nursery level. If government schools provide similar assurance, parents will prefer them. He underlined that education today is the only weapon to eradicate poverty, recalling Nehru’s foresight in establishing universities and IITs.
He noted that while job opportunities have increased with economic reforms, education standards have lagged, with less than 10% of engineering graduates securing jobs due to lack of skills. Skill development, cleansing the system, and integrating language, knowledge, skills and sports into education are essential, he said. He highlighted initiatives such as teacher appointments, promotions, transfers, converting ITIs into ATC centres, and establishing Young India Skills University.
The Chief Minister emphasized that the system must benefit the poor and ensure equal opportunities for BC, SC, ST and minority students.
The meeting was attended by Telangana Education Policy Chairman Kesava Rao, retired IAS officer I.V. Subbarao, IIT Hyderabad Director Prof. B.S. Murthy, Prof. Haragopal, MLCs A.V.N. Reddy and Sripal Reddy, State Chief Secretary K. Ramakrishna Rao, educationists Prof. Kodandaram, Mohan Guruswamy and Prof. Subbarao, CII’s Shekhar Reddy, Higher Education Board Chairman Balakista Reddy, Aksharavanam Madhav Reddy, Education Commission Chairman Akunuri Murali, Prof. Gangadhar, retired IAS officers Mini Mathew and Ranjeev Acharya, Prof. Shantha Sinha and several others.
