అంగరంగ వైభవంగా ప్రారంభమైన పవిత్ర సరస్వతి మహా పుష్కరాల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. తొలుత పుష్కర ఘాట్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సరస్వతీ దేవి వారి ఏకశిలా విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. త్రివేణి సంగమం వద్ద పవిత్ర పుణ్య స్నానం ఆచరించారు.

అనంతరం శ్రీ సరస్వతీ దేవి ఆలయానికి చేరుకుని అమ్మ వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రి గారు అక్కడ పవిత్ర పుష్కరాలను ప్రారంభించిన శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ సరస్వతి దేవి ఏకశిలా విగ్రహం ముందు నదీ ముఖంగా ఏర్పాటు చేసిన వేదికపై మహా సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో 9 హారతులను అందించిన మహాద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులతో కలిసి వీక్షించారు. పుష్కరాల సందర్బంగా వారణాసిలో గంగా నదికి హారతినిచ్చే ఏడుగురు వేద పండితులు ప్రత్యేక ఆహ్వానితులుగా సరస్వతి పుష్కరాలకు విచ్చేసి ఈ నవరత్న మాల హారతులను ఇచ్చారు.
ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం చేరుకున్న సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారితో ఈ పవిత్ర పుష్కరాల్లో పాల్గొన్నారు.
